తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Wednesday, March 24, 2010

రామచంద్రరాయలు

రామచంద్రరాయలు
పరిపాలన కాలము -> 1422 వ సంవత్సరము మాత్రమే


మొదటి దేవరాయల మరణానంతరము, 1422 వ సంవత్సరమునందు రామచంద్రరాయలు పరిపాలనకు వచ్చెను. తన తండ్రిగారైన మొదటి దేవరాయలవలె ఇతను గొప్ప విజయములు సాధించినవాడు కాడు, సామ్రాజమును పరిపాలించగలిగే సమర్ధుడు అంతకన్నా కాడు.


పాలనకు వచ్చిన నాలుగు మాసాలలోనే, తన తమ్ముడైన వీర విజయ బుక్క రాయలు, ఇతనిని తొలగించి, విజయనగర సామ్రాజ్యపు సింహాసనమును అధిష్టించెను.



దాదారెడ్డి పల్లెలోనుంచి దొరికిన, 1416 వ సంవత్సరపు శాసనాల ప్రకారము, రామచంద్ర రాయలు, తన తండ్రిగారి పరిపాలన కాలమునందు ఉదయగిరి ప్రాంతమునకు అధిపతిగా వుండెనట.



Friday, February 5, 2010

మొదటి దేవరాయలు

మొదటి దేవరాయలు
పరిపాలన కాలము -> 1406 నుంచి 1422 వరకు












మొదటి దేవరాయలు రెండవ హరిహర రాయల కొడుకగును. ఇతను, తన అన్నగారైన రెండవ బుక్క రాయల నుంచి, రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకొని, రెండవ బుక్క రాయలను తొలగించి, 1406 వ సంవత్సరమునందు, సామ్రాజ్యపు సింహాసనమును ఎక్కెను.
















దండయాత్రలు ->

ఇతను పరిపాలనకు వచ్చిన తొలి రోజులలోనే, విజయనగర సామ్రాజ్యమునందు జరిగిన కలహాల కారణముగా, తన సైన్యమునకు సరైన సైన్యాధిపతిని నియమించలేకపోయెను. దాడి చేసినచో, ఎదుర్కోలేని పరిస్ధితిలో వున్న విజయనగర సేనల గురించి తెలుసుకున్న, ముస్లీం రాజు ఫిరోద్ షా, ఈ అవకాశమును ఉపయోగించి, తన సైన్యముతో విజయనగరముపై దండయాత్రకు బయలుదేరెను. ఫిరోద్ షా యొక్క అంచనా వేసినట్లుగానే, విజయనగర సైనికులు ఈ దండయాత్రను ఎదిరించలేకపోయిరి. విజయనగరము ఈ యుద్ధమునందు ఓడిపోయినది. ఓడిపోవుటేగాక, ఫిరోద్ షాకు విజయనగర ప్రభువులైన మొదటి దేవరాయలు, 32 లక్ష రూపాయలు చెల్లించవలసి వచ్చినదని, సయ్యదాలి వ్రాతలు తెలుపుచున్నవి.

ఈ యుద్ధమును అనుసరించి, మొదటి దేవరాయలు, ఉదయగిరి రాజ్యముపై దాడి చేసి, ఆ రాజ్యమునకు చేరిన పులుగునాడు మరియు పొత్తపినాళ్ళను, స్వాధీనపరుచుకొనెను.
ఫిరోద్ షాపై జరుగిన యుద్ధమునందు పొందిన అపజయమునకు బాధపడి, మొదటి దేవరాయలు రాజమండ్రిని పరిపాలించుచున్న కాటయవేమునితో స్నేహముచేసుకొని,ఇరువురూ కలిసి ఫిరోద్ షాపై యుద్ధముచేయుటకు గొప్ప పధకమును రూపొందించిరి. కానీ, అంతలో కొండవీటి పెద్దకోమటి వేమా రెడ్డి మరియు అతని స్నేహితుడగు అన్నదేవచోడునితో కలిసి ఫిరొద్ షాతో స్నేహము చేసుకొని, విజయనగర ప్రభువులైన మొదటి దేవరాయలు మరియు కాటయవేముని సైన్యములను ఎదుర్కొనిరి.
ఈ యుద్ధమునందు, పెద్దకోమటి వేమా రెడ్డితో పోరాడు సమయమున, మొదటి దేవరాయల మిత్రుడైన కాటయ వేముడు మరణించెను. దానితో కాటయ వేముని బలాన్ని కోల్పోయిన మొదటి దేవరాయలు, అలాడ రెడ్డి మరియు అతని కొమారులగు వేమా మరియు వీరభద్ర రెడ్లతో కలిసి, విరోదులైన ఫిరోద్ షా  మరియు పెద్ద కోమటి వేమ రెడ్డితో పోరడి విజయము సాధించెను.
ఇటువంటి ఓటమిని పొందిన పిమ్మట, ఫిరోద్ షా తన సైన్యములతో కలిసి పానుగల్లు దుర్గమును ఆక్రమించెను. కానీ కొండవీడు- బహుమనీల స్నేహమును చూసిన రేచర్ల పద్మనాయకులు, విజయనగర ప్రభువులతో స్నేహము చేసుకొనెను. ఆ తరువాత కోల్పోయిన పానుగల్లు దుర్గమును తిరిగి సొంతము చేసుకొనుటకై రేచర్ల పద్మనాయకులు మరియు మొదటి దేవరాయలు కలిసి, ఫిరోద్ షాతో యుద్ధమునకు బయలుదేరిరి. కానీ సులువుగా సాధించలేని ఆ దుర్గమునకొఱకు, వారిరువురూ రెండు సంవత్సరాలు కష్ట పడి పోరాడి చివరకు విజయము సాధించిరి.
 ఆ తరువాత, విజయనగర ప్రభువులు, బహుమనీ సుల్తానుకు కొండవీటి రాజుల నుండి ఎటువంటి సహాయము రాకుండా చేయుటకు, తీరాంధ్ర ప్రదేశమును ఆక్రమించుటకు ఓ గొప్ప సైన్యమును అచ్చటి పాలకులపై పంపెను.ఈ సైన్యము, ఓ గొప్ప సైన్యాధిపతి యొక్క నాయకత్వముతో పొత్తపినాడు, పులుగునాడు మరియు మోటుపల్లి రేవును ఆక్రమించినది.
మొదటి దేవరాయలు, ఈ రెండు యుద్ధములందు, విజయాలు సాధించి బహుమనీ సుల్తాను మరియు కొండవీటి రాజును ఓడించి, నల్గిండ, పానుగొల్లు, కోస్తాంధ్ర ప్రదేశాలను మొత్తము స్వాధీనపరుచుకొనెను.

మొదటి దేవరాయలు తన పరిపాలన కాలమున సాధించిన విజయాలు, విజయనగర సామ్రాజ్యమును చరిత్రలు ఓ ఉన్నత స్దానమునందు వుంచుటకు తోడ్పడ్డాయి.

మొదటి దేవరాయలు తను సాధించిన స్ఫూర్తివంతమైన విజయాలతోపాటు రాజధాని నగరమును చక్కగా పటిష్ట పరచి,  కోట గోడలూ, బురుజులూ కట్టించి, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి, వ్యవసాయాన్ని అభివృద్ది చేసెను.
ఇతని పరిపాలన కలమున, రాజధానియైన విజయనగరము 60 మైళ్లు విస్తరించినట్లుగా ఐరోప్పియన్ పయనికుడు నికోలస్ కాంటి వివరించియున్నాడు.మరొక గమనించవలసిన విషయమేమిటంటే, విక్రమార్క చరిత్రను రచించిన జక్కన కవి ఇతని కాలమువాడే.

మొదటి దేవరాయలు మరణించిన తరువాత, తన కుమారుడైన రామచంద్రరాయలు పాలనకు వచ్చెను.


Thursday, February 4, 2010

రెండవ బుక్క రాయలు

రెండవ బుక్క రాయలు
పరిపాలన కాలము -> 1405 నుంచి 1406 వరకు
ఇతను రెండవ హరిహర రాయల పెద్ద కుమారుడగును. రెండవ హరిహర రాయల మరణానంతరము, ఇతని తమ్ముడైన మొదటి విరూపాక్షరాయలు, సింహాసనమును బలవంతముగా అపహరించుటవలన, విధేయులు సహాయము పొంది, రెండవ బుక్క రాయలు, మొదటి విరూపాక్షరాయలను తొలగించి, 1405 వ సంవత్సరమునందు, విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును అధిష్టించెను.

కానీ, ఇతను కూడ చాలా తక్కువ కాలమునకు రాజ్య పాలన చేయగలిగెను.

పరిపాలనకు వచ్చిన కొన్ని మాసాలలోనే, ఇతని మరొక తమ్ముడగు- మొదటి దేవరాయలు, ఇతనిని తొలగించి, సింహాసనమును స్వాధీనపరుచుకొనెను.

తన తండ్రిగారైన రెండవ హరిహర రాయల కాలమునందు, రేచర్ల పద్మనాయకులపై ఇతను చేసిన యుద్ధములే, రెండవ బుక్క రాయల సాధనలు.



మొదటి విరూపాక్ష రాయలు

మొదటి విరూపాక్ష రాయలు
పరిపాలన కాలము -> 1404 నుంచి 1405 వరకు

రెండవ హరిహర రాయల మరణము తరువాత, మొదటి విరూపాక్ష రాయలు, తన అన్నగారైన రెండవ బుక్క రాయల వద్ద నుంచి సింహాసనమును బలవంతముగా అపహరించెను. కానీ, ఇతను చాలా తక్కువ కాలమునకు మాత్రమే పరిపాలించగలిగెను.

మొదటి విరూపాక్ష రాయలు, పాలనకు వచ్చి ఒక సంవత్సరము తరువాత, తన అన్నగారైన రెండవ బుక్క రాయలు సామంతులు మరియు విధేయుల సహాయమును పొంది, ఇతనిని తొలగించి, విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును స్వాధీనపరుచుకొనెను.

ఇతని సాధనలను గురించి చెప్పవలెనంటే, తన తండ్రి గారైన రెండవ హరిహర రాయల హయాములో, ఓ గొప్ప నావికా సైన్యమును ఏర్పరుచుకొని, సముద్రమును దాటి, సింహళ రాజ్యమును సాధించెను.

మొదటి విరూపాక్ష రాయల పరిపాలన కాలమునందు, అతను గోవా, చావుల్, ధాబోలు వంటి ప్రదేశాలను విరోదుల వద్ద కోల్పోయెనని, పయనికుడు పెర్నోవో నూనీజ్, విజయనగర సామ్రాజ్యమును గురించి వ్రాసిన పుస్తకములో చెప్పియున్నాడు.

Saturday, January 30, 2010

రెండవ హరిహర రాయలు

రెండవ హరిహర రాయలు
పరిపాలన కాలము - 1377 నుంచి 1404 వరకు

మొదటి బుక్క రాయల మరణానంతరము, అతని కుమారుడైన రెండవ హరిహర రాయలు పాలనకు వచ్చెను.
ఇతను పాలనకు రాగానే, తన తండ్రిగారి పాలనాకాలమునందు నియమించబడిన సామంతులు కొందరు స్వంతంత్రించవలెనన్న అభిలాషతో యుద్ధము చేయుటకు సిద్ధమయ్యారని తెలిసి, వెంటనే వారిని తొలగించి, తన పుత్రులను సామతులుగా నియమెంచెను. ఉదయగిరి ప్రాంతమునకు మొదటి దేవరాయలను, మరియు మధుర ప్రాంతమునకు మొదటి విరూపాక్ష రాయలను సామంతులుగా నియమించెను.

యుద్ధములు ->
ఎంతటి సంధి కుదుర్చుకొన్ననూ, విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధము తప్పలేదు. 1378 వ సంవత్సరమున, బహుమనీ సుల్తానైన ముజాహీద్ షా, దారుణముగా హతమార్చబడెను. దీనితో బహుమనీ రాజ్యమునందు, అంతఃకలహాలు మొదలైనవి. అదే సంవత్సరమునందు, బహుమనీ
సామ్రాజ్యపు సింహాసనమును శాంతి శీలుడైన రెండవ ముహమ్మద్ షా అధిష్టించెను. కానీ, అప్పటికే దక్షిణ దేఅమంతయూ పరిస్థితులు, గంధరగోళముగా ఉండేవి. కొండవీడు రాజ్యమునందు,
పెద్ద కోమటి వేమా రెడ్డి, కుమార గిరి రెడ్డి మరియు కాటయ వేమా రెడ్ల మధ్య తరచూ యుద్ధములు జరుగుచుండేవి. ఇలా విడిపొవుటకు సిద్ధముగానున్న, కొండవీడు రాజ్యమునూ మరియు అప్పటికే దక్షిణ భారత దేశమంతా వ్యాపించియున్న విజయనగర సామ్రజ్యమునూ, ఆక్రమించాలన్న కోరికతో, రేచర్ల పద్మనాయకుడను ఒక పాలకుడు, బహుమనీ సులతానుతో స్నేహము చేసుకొనెను. ఈ రెండు రాజ్యములను ఆక్రమించుటకై, బహుమనీ సుల్తానుతో కలిసి ఓ గొప్ప పధకమును రూపొందించెను. ఇటువంటి పరిస్ధితులలో, రెండవ హరిహర రాయలు , కొండవీడు రాజ్యమునకు చేరిన శ్రీశైలం ప్రాంతమును స్వాధీనపరచుకొనెను. ఇందుకు కోపగించిన కాటయ వేమా రెడ్డి, తన సైన్యమును వెంటబెట్టుకొని, విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఓడించెను. తప్పనిసరి పరిస్ధితులలో, రెండవ హరిహర రాయలు, కాటయ వేమా రెడ్డితో సంధి చేసుకొనెను. అంతేగాక, తన కొమర్తెయైన లక్ష్మిని, కాటయ వేముని కొడుకొతో పెళ్ళి జరిపించెను.

ఉదయగిరి ప్రాంతమునకు సామతునిగా నియమించబడిన, రెండవ హరిహర రాయల కొడుకైన మొదటి దేవరాయలు, ఓ గొప్ప సైన్యమును ఏర్పరచి, మోటుపల్లి రేవును ఆక్రమించెను. అప్పటికే కొండవీడు రాజ్యమును పాలించుచున్న కుమార గిరి రెడ్డిపై పెద్ద కోమటి వేమారెడ్డి యుద్ధము చేసి, విజయవంతముగా కొండవీడు రాజ్యమును తన సొంతము చేసుకొనెను. కొండవీడు రాజ్యమునకు రాజువైన కొన్ని రోజులలోనే, రెండవ హరిహర రాయలు, ఈ ప్రాంతమును వశపరుచుకొనుటకు, చౌండ సేనానిని ఓ గొప్ప సైన్యముతో, కొండవీటి రాజువైన పెద్ద కోమటి వేమారెడ్డి పై పంపెను. ఇందుకు పెద్ద కోమటి వేమా రెడ్డి, తన సైన్యముతో బయలుదేరి, విజయనగర సైన్యములను ఎదిరించి, వారిని ఓడించి, కొండవీటి సరిహద్దును దాటిరాలేక తరిమివేసెను. ఈ యుద్ధము "మోటుపల్లి యుద్ధము"గా ప్రసిద్ధమైనది.

అప్పటికే మెల్లమెల్లగా, రేచర్ల పద్మనాయకులు, విజయనగర సామ్రాజ్యమునకు చెందిన కొన్ని చిన్న చిన్న ప్రదేశాలను తన ఆధీనములోకు తెచ్చుకొనుట మొదలుపెట్టెను. దీనిని చూచి కోపిగించిన రెండవ హరిహర రాయలు తన పెద్ద కొడుకైన రెండవ బుక్క రాయలను, రేచర్ల పద్మనాయకుల పై పంపెను. రెండవ బుక్కరాయల సైన్యమును ఎదిరించుటకై, రేచర్ల పద్మనాయకులు, బహుమనీ సుల్తాను యొక్క సహాయము పొందెను. ఇరువురు అధిపతులు కలిసి, కొత్తకొండ ప్రాంతమున విజయనగర సైన్యములను ఓడించిరి. విజయనగర సేనలో వున్న సాళువ రామదేవుడు వంటి గొప్ప వీరులు, ఈ యుద్ధముననదు తమ ప్రాణాలు కోల్పోయిరి. అపజయము పొందిన రెండవ బుక్క రాయలు విజయనగరమునకు తిరిగివచ్చెను.

ఈ అపజయమును, రెండవ హరిహర రాయలు సహించలేకపోయెను. ఓ గొప్ప సైన్యమును ఏర్పర్చెను. అంతేగాక, గండదండాధీసుడు వంటి గొప్ప వీరులను ఆ సైన్యమునకు సైన్యాధీశులుగా చేసి, మరొక సైన్యమును ఏర్పరచి, అందుకు రెండవ బుక్క రాయలను సైన్యాధీసునిగా చేసి, రేచర్ల పద్మనాయకులపై పంపెను. రెండు పక్షాల మధ్య, ఓ భయంకరమైన యుద్ధము జరిగినది. ఈ యుద్ధము 1397 వ సంవత్సరమునందు జరిగినది. రేచర్ల పద్మ నాయకులు, బహుమనీ సుల్తాను యొక్క సహకారము పొందవలెనని చూచెను. కానీ, అంతలోనే విజయనగర సైనికులు, కృష్ణా నదీ ఉత్తర భాగమున రేచర్ల పద్మనాయకుల రాజ్యపు ముఖ్యమైన కోటైన పానుగల్లు కోటను ముట్టడించి, ఆక్రమించిరి. అంతేగాక, చౌల్, ధాబోల్ వంటి ప్రాంతాలను కూడా వశపరుచుకొనిరి.

మధుర ప్రాంతమునకు సామంతునిగా నియమింపబడిన, మొదటి విరూపాక్ష రాయలు, ఓ గొప్ప గొప్ప నావికా సైన్యమును అభివృద్దిచేసి, సముద్రమును దాటి, సింహళ దేశము పై దాడి చేసెను. సింహళ రాజ్యమును పాలించుచున్న, అధిపతులు నలుగురు కలిసి, ఈ దాడిని ఎదుర్కొనిరి. కానీ, దురాదృష్టము వారు వెంటపడినందున, నలుగురు కలిసినా, మొదటి విరూపాక్ష రాయల ముందు ఓటమి చెందవలసి వచ్చినది. అంతేగాక మొదటి విరూపాక్ష రాయలు ఆ నలుగురు అధిపతులను తొలగించి, తమ రాజ్యము నుంచి ఆ ప్రాంతమునకు ఇరువురు రాజులను సామతులుగా నియమించెను. సామతులుగా నియమితులైన రాజులు, విజయనగరాధీశులైన రెండవ హరిహర రాయలకు కప్పమును చెల్లించిరి.
సింహళ రాజులతో జరిగిన యుద్ధము భారత దేశపు చరిత్రలోని గొప్ప యుద్ధాలులో ఒకటైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటి సారిగా, ఓ అధిపతి, ఒక గొప్ప నావికాదళమును రూపొందించి, సముద్రాలను దాటి పోరు చేసియున్నాడు. ఇది ఒక గొప్ప సాధనే కాదా!.


కొండవీడు రాజ్యమున జరిగిన కలహాలవలన, ఆ రాజ్యమునందు పరిస్ధితులు రోజు రోజుకు గంధరగోళముగా మారసాగినవి. రెండవ హరిహర రాయాలు, ఈ అవకాశమును తమకు అనుకూలముగా వాడుకొని, కొండవీడు రాజ్యమునకు చేరిన కొన్ని ముఖ్యమైన ప్రానతములను తమ ఆధీనములోకు తెచ్చుకొనుటకు, ఓ సైన్యముతో బయలుదేరెను. అప్పటికే, కొండవీడు రాజ్యము చేజారిందన్న కోపముతో, కొండవీటి పాలకుడైన పెద్ద కోమటి వేమా రెడ్డిపై పగపట్టిన కాటయ వేమా రెడ్డి, విజయనగర ప్రభువులైన మొదటి హరిహర రాయలతో కలిసి, పెద్ద కోమటి వేమా రెడ్డిపై యుద్ధము చేసిరి. విజయము సాధించిరి.

న్యాయముగా, నియమాల ప్రకారము, రెండవ హరిహర రాయల తరువాత తన పెద్ద కుమారుడైన రెండవు బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యపు సింహాసనమును అధిష్టించవలెనుగానీ, గొప్ప సైన్యమును ఏర్పరుచుకొని, సింహళ దేశమును జయించినవాడైన మొదటి విరూపాక్ష రాయలు, 1404 వ సంవత్సరమునందు బలవంతముగా సింహాసనమును ఎక్కెను.

Friday, January 29, 2010

మొదటి బుక్క రాయలు

మొదటి బుక్క రాయలు
పరిపాలన కాలము -> 1356 నుంచి 1377 వరకు

మొదటి హరిహర రాయల తరువాత 1356 వ సంవత్సరమున, మొదటి బుక్క రాయలు పాలనకు వచ్చెను. విజయనగర సామ్రాజ్యపు స్ధాపనలోనూ, మరియు సామ్రాజ్యపు స్ధాపన తరువాత బహుమనీ సుల్తానులతో జరిగిన కొన్ని యుద్ధములలో, మొదటి బుక్క రాయలు, తన అన్నగారైన మొదటి హరిహర రాయలకు సహకరించినట్లుగా, సేకరించబడిన ఆధారములు తెలుపుచున్నవి. అంతేగాక, ముస్లీం సుల్తానుల చేత ఆక్రమింపబడిన, అనేక హిందూ క్షేత్రాలలను, తన కుమారుడగు కంప రాయలను సుల్తానుల పై యుద్ధమునకు పంపి, ఆ క్షేత్రాలకు స్వతంత్రము తెప్పించెను.

దండయాత్రలు -

మొదటి బుక్క రాయల 21 సంవత్సరాల పరిపాలన కాలమునందు, అతను విజయనగర సామ్రాజ్యమును విస్తరించుకొనసాగెను.
1360 వ సంవత్సరములోగా, ఏర్కాడు మరియు కొండవీటి రెడ్ల రాజ్యములను అతను తన ఆధీనములోకు తెచ్చుకొనెను.
అంతేగాక పెనుకొండ ప్రాంతమును ఏలుచున్న రాజును ఓడించి, ఆ ప్రాంతమును కూడ విజయనగరముతో కలుపుకొనెను.
ఆ తరువాత, మదురై రాజ్యమును పాలించిన, సుల్తానుపై యుద్ధము చేసి, రామేశ్వరము వరకు స్వాధీనము చేసుకొనెను.


బహుమనీ సుల్తానైన మొదటి ముహమ్మదు షా, దండయాత్రకు బయలుదేరి, వరంగల్ ప్రాంతముపై దండెత్తెను. ఈ దండయాత్రను ఒకడె ఎదుర్కోలేక, వరంగల్ పాలకుడు మొదటి బుక్క రాయల సహాయము కోరెను. కానీ దురాదృష్టవశాత్తుగా వరంగల్ రాజుకు సహకరించుటకు వచ్చిన మొదటి బుక్క రాయలు కూడా బహుమనీ సుల్తానుచేత అపజయము పొందెను. ఈ అపజయమును సహించలేని మొదటి బుక్క రాయలు, ఓ గొప్ప సైన్యముతో బయలుదేరి బహుమనీ రాజ్యమునకు చెందిన ముద్గల్లు కోటను ఆక్రమించెను. ఇందుకు కోపగించిన బహుమనీ సుల్తాను, తన సేనలను పంపెను. బహుమనీ సేనలు ముందుకు వచ్చి, విజయనగర సేనలను ఎదుర్కొని, రెండు రాజ్యాల మధ్య ఆదోని, కౌతల ప్రదేశాలందు, ఓ భయంకరమైన యుద్ధము జరిగినది. ఈ యుద్ధము వలన సాధారణ ప్రజానీకమునకు, చాలా కష్టాలు ఏర్పడినవి. వేలకొలది ప్రజలు నిరాశ్రయలై, వందల కొలది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయిరి. ఈ మరణాలను చూడలేక మొదటి బుక్క రాయలు, బహుమనీ సుల్తనుతో సంధి కుదుర్చుకొనుటకు నిర్ణయించుకొనెను. చివరకు, మొదటి బుక్క రాయలు, ఈ యుద్ధము వలన తమ ప్రజలకు ఏర్పడిన నష్టమును చూచి, బహుమనీ సుల్తానుతో సంధి కుదుర్చుకొనుటకు నిర్ణయించెను. బహుమనీ సుల్తాను కూడా ఇందుకు సమ్మతించెను. సంధి కుదుర్చుకొన్న పిమ్మట, సంధి షరతులను అనుసరించి, ఇరువురు అధిపతులు తమ తమ ప్రజానీకమునకు ఎటువంటి కష్టాలు కలిగించకుండ, తమ తమ రాజ్యములను శాంతముగా పాలించుచూ స్నేహితులువలె ఉండిపోయిరి.

ఈ యుద్ధము తరువత 1375 వ సంవత్సరము వరకు, శాంతము కొనసాగినది.
1375 వ సంవత్సరమునందు, బహుమనీ సుల్తానైన మొదటి ముహమ్మదు షా మరణించెను. అతని వారసుడగు ముజాహీద్ షా పాలనకు వచ్చెను. ఈ సమయమున, మొదటి బుక్క రాయలు కృష్ణా నదీ మరియు తుంగభద్ర నదీ ప్రాంతముల మధ్యగల ప్రదేశాలను ఆక్రమించెను. అంతే! ముజాహీద్ షా కోపితుడై, ఓ పెద్ద సైన్యమును విజయనగరం పై నడిపెను. శాంతి కొరకు కుదుర్చుకున్న సంధి లేకుండపోయినది. మళ్ళీ మొదలైనది మరొక యుద్ధము. మొదటి బుక్క రాయలు కూడా తమ సైన్యములతో బహుమనీ సైన్యములను ఎదుర్కొనెను. కానీ విజయనగరము, బహుమనుల చేత ఓటమి చెందినది. బహుమనీ సైనికులు, విజయనగర సైనికులు తుంగభద్ర నదీ తీరమును దాటిరాలేక తరిమివేసిరి.

మొదటి బుక్క రాయలు, "ఉత్తమహరివంశము" ను వ్రాసిన నాచన సోమన కవికి, తన ఆస్ధానమున ఆశ్రయము ఇచ్చుచున్నట్లు ఆధారములున్నవి.


మొదటి హరిహర రాయలు

మొదటి హరిహర రాయలు
పరిపాలన కాలము -> 1336 నుంచి 1356 వరకు

మొదటి హరిహర రాయలు, విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన తొలి పాలకుడగును. పరిపాలనకు వచ్చిన తొలి రోజులలో ఇతను హొయసల రాజ్యపు ఉత్తర భూభాగాలను మాత్రమే పరిపాలించినట్లుగా తెలియుచున్నది.

1343 వ సంవత్సరమునందు, హొయసల సామ్రాజ్యపు చక్రవర్తియగు మూడవ వీరబళ్లాలుడు అకాలముగా మరణించెను. ఈ అవకాశమును ఉప్యోగించి, రాజులేని హొయసల సామ్రాజ్యమంతయూ మొదటి హరిహర రాయలు తమ రాజ్యమున కలుపుకొనెను.


దిగ్విజయ దండయాత్రలు =>

మొదట, మొదటి హరిహర రాయలు, తన తమ్ముడగు మొదటి బుక్క రాయల సహాయముతో, తుంగభద్ర లోయ ప్రాంతమును తన ఆధీనములోకు తెచ్చుకొనెను. ఆ తరువాత, కొంకణ మరియు మలబారు తీరములపై దండెత్తి, విజయము సాధించెను.
ఆ సమయముననే, హొయసల సామ్రాజ్యము పతనమైనది. చివరి పాలకుడగు మూడవ వీర బళ్లాలుడు, మధుర సుల్తానుతో పోరాడు సమయమున మరణించెను. ఇందువలన ఏర్పడిన పాలనశూన్యత వలన, నూనెలేని దీపములాగా ఆరిపోయే పరిస్ధితిలో ఉన్న హొయసల సామ్రాజ్యమును, మొదటి హరిహర రాయలు, ఆక్రమించి, స్వాధీనపరుచుకొనెను. ఇందువలన విజయనగర సామ్రాజ్యము విస్తరించినది. అంతేగాక, దక్షిణ భారతమున గొప్ప సామ్రాజ్యముగా పేర్కొన్నది.

1346 నాటి శృంగేరి తామ్రశాసనమునందు, మొదటి హరిహర రాయలు రెండు సముద్రాల మధ్యగల భూమికి అధిపతియని చెప్పబడినది.దండయాత్రల నుంచి రాజధానికి వెనుదిరిగిన మొదటి హరిహర రాయలు, సుస్ధిరమైన పాలనా వ్యవస్ధను ఏర్పరిచెను. ఇందువలన రాజ్యము సుస్ధిరమైనది.

మొదటి హరిహర రాయల తరువాత, అతని తమ్ముడగు మొదటి బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును అధిష్టించెను.