తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Friday, February 5, 2010

మొదటి దేవరాయలు

మొదటి దేవరాయలు
పరిపాలన కాలము -> 1406 నుంచి 1422 వరకు












మొదటి దేవరాయలు రెండవ హరిహర రాయల కొడుకగును. ఇతను, తన అన్నగారైన రెండవ బుక్క రాయల నుంచి, రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకొని, రెండవ బుక్క రాయలను తొలగించి, 1406 వ సంవత్సరమునందు, సామ్రాజ్యపు సింహాసనమును ఎక్కెను.
















దండయాత్రలు ->

ఇతను పరిపాలనకు వచ్చిన తొలి రోజులలోనే, విజయనగర సామ్రాజ్యమునందు జరిగిన కలహాల కారణముగా, తన సైన్యమునకు సరైన సైన్యాధిపతిని నియమించలేకపోయెను. దాడి చేసినచో, ఎదుర్కోలేని పరిస్ధితిలో వున్న విజయనగర సేనల గురించి తెలుసుకున్న, ముస్లీం రాజు ఫిరోద్ షా, ఈ అవకాశమును ఉపయోగించి, తన సైన్యముతో విజయనగరముపై దండయాత్రకు బయలుదేరెను. ఫిరోద్ షా యొక్క అంచనా వేసినట్లుగానే, విజయనగర సైనికులు ఈ దండయాత్రను ఎదిరించలేకపోయిరి. విజయనగరము ఈ యుద్ధమునందు ఓడిపోయినది. ఓడిపోవుటేగాక, ఫిరోద్ షాకు విజయనగర ప్రభువులైన మొదటి దేవరాయలు, 32 లక్ష రూపాయలు చెల్లించవలసి వచ్చినదని, సయ్యదాలి వ్రాతలు తెలుపుచున్నవి.

ఈ యుద్ధమును అనుసరించి, మొదటి దేవరాయలు, ఉదయగిరి రాజ్యముపై దాడి చేసి, ఆ రాజ్యమునకు చేరిన పులుగునాడు మరియు పొత్తపినాళ్ళను, స్వాధీనపరుచుకొనెను.
ఫిరోద్ షాపై జరుగిన యుద్ధమునందు పొందిన అపజయమునకు బాధపడి, మొదటి దేవరాయలు రాజమండ్రిని పరిపాలించుచున్న కాటయవేమునితో స్నేహముచేసుకొని,ఇరువురూ కలిసి ఫిరోద్ షాపై యుద్ధముచేయుటకు గొప్ప పధకమును రూపొందించిరి. కానీ, అంతలో కొండవీటి పెద్దకోమటి వేమా రెడ్డి మరియు అతని స్నేహితుడగు అన్నదేవచోడునితో కలిసి ఫిరొద్ షాతో స్నేహము చేసుకొని, విజయనగర ప్రభువులైన మొదటి దేవరాయలు మరియు కాటయవేముని సైన్యములను ఎదుర్కొనిరి.
ఈ యుద్ధమునందు, పెద్దకోమటి వేమా రెడ్డితో పోరాడు సమయమున, మొదటి దేవరాయల మిత్రుడైన కాటయ వేముడు మరణించెను. దానితో కాటయ వేముని బలాన్ని కోల్పోయిన మొదటి దేవరాయలు, అలాడ రెడ్డి మరియు అతని కొమారులగు వేమా మరియు వీరభద్ర రెడ్లతో కలిసి, విరోదులైన ఫిరోద్ షా  మరియు పెద్ద కోమటి వేమ రెడ్డితో పోరడి విజయము సాధించెను.
ఇటువంటి ఓటమిని పొందిన పిమ్మట, ఫిరోద్ షా తన సైన్యములతో కలిసి పానుగల్లు దుర్గమును ఆక్రమించెను. కానీ కొండవీడు- బహుమనీల స్నేహమును చూసిన రేచర్ల పద్మనాయకులు, విజయనగర ప్రభువులతో స్నేహము చేసుకొనెను. ఆ తరువాత కోల్పోయిన పానుగల్లు దుర్గమును తిరిగి సొంతము చేసుకొనుటకై రేచర్ల పద్మనాయకులు మరియు మొదటి దేవరాయలు కలిసి, ఫిరోద్ షాతో యుద్ధమునకు బయలుదేరిరి. కానీ సులువుగా సాధించలేని ఆ దుర్గమునకొఱకు, వారిరువురూ రెండు సంవత్సరాలు కష్ట పడి పోరాడి చివరకు విజయము సాధించిరి.
 ఆ తరువాత, విజయనగర ప్రభువులు, బహుమనీ సుల్తానుకు కొండవీటి రాజుల నుండి ఎటువంటి సహాయము రాకుండా చేయుటకు, తీరాంధ్ర ప్రదేశమును ఆక్రమించుటకు ఓ గొప్ప సైన్యమును అచ్చటి పాలకులపై పంపెను.ఈ సైన్యము, ఓ గొప్ప సైన్యాధిపతి యొక్క నాయకత్వముతో పొత్తపినాడు, పులుగునాడు మరియు మోటుపల్లి రేవును ఆక్రమించినది.
మొదటి దేవరాయలు, ఈ రెండు యుద్ధములందు, విజయాలు సాధించి బహుమనీ సుల్తాను మరియు కొండవీటి రాజును ఓడించి, నల్గిండ, పానుగొల్లు, కోస్తాంధ్ర ప్రదేశాలను మొత్తము స్వాధీనపరుచుకొనెను.

మొదటి దేవరాయలు తన పరిపాలన కాలమున సాధించిన విజయాలు, విజయనగర సామ్రాజ్యమును చరిత్రలు ఓ ఉన్నత స్దానమునందు వుంచుటకు తోడ్పడ్డాయి.

మొదటి దేవరాయలు తను సాధించిన స్ఫూర్తివంతమైన విజయాలతోపాటు రాజధాని నగరమును చక్కగా పటిష్ట పరచి,  కోట గోడలూ, బురుజులూ కట్టించి, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి, వ్యవసాయాన్ని అభివృద్ది చేసెను.
ఇతని పరిపాలన కలమున, రాజధానియైన విజయనగరము 60 మైళ్లు విస్తరించినట్లుగా ఐరోప్పియన్ పయనికుడు నికోలస్ కాంటి వివరించియున్నాడు.మరొక గమనించవలసిన విషయమేమిటంటే, విక్రమార్క చరిత్రను రచించిన జక్కన కవి ఇతని కాలమువాడే.

మొదటి దేవరాయలు మరణించిన తరువాత, తన కుమారుడైన రామచంద్రరాయలు పాలనకు వచ్చెను.


Thursday, February 4, 2010

రెండవ బుక్క రాయలు

రెండవ బుక్క రాయలు
పరిపాలన కాలము -> 1405 నుంచి 1406 వరకు
ఇతను రెండవ హరిహర రాయల పెద్ద కుమారుడగును. రెండవ హరిహర రాయల మరణానంతరము, ఇతని తమ్ముడైన మొదటి విరూపాక్షరాయలు, సింహాసనమును బలవంతముగా అపహరించుటవలన, విధేయులు సహాయము పొంది, రెండవ బుక్క రాయలు, మొదటి విరూపాక్షరాయలను తొలగించి, 1405 వ సంవత్సరమునందు, విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును అధిష్టించెను.

కానీ, ఇతను కూడ చాలా తక్కువ కాలమునకు రాజ్య పాలన చేయగలిగెను.

పరిపాలనకు వచ్చిన కొన్ని మాసాలలోనే, ఇతని మరొక తమ్ముడగు- మొదటి దేవరాయలు, ఇతనిని తొలగించి, సింహాసనమును స్వాధీనపరుచుకొనెను.

తన తండ్రిగారైన రెండవ హరిహర రాయల కాలమునందు, రేచర్ల పద్మనాయకులపై ఇతను చేసిన యుద్ధములే, రెండవ బుక్క రాయల సాధనలు.



మొదటి విరూపాక్ష రాయలు

మొదటి విరూపాక్ష రాయలు
పరిపాలన కాలము -> 1404 నుంచి 1405 వరకు

రెండవ హరిహర రాయల మరణము తరువాత, మొదటి విరూపాక్ష రాయలు, తన అన్నగారైన రెండవ బుక్క రాయల వద్ద నుంచి సింహాసనమును బలవంతముగా అపహరించెను. కానీ, ఇతను చాలా తక్కువ కాలమునకు మాత్రమే పరిపాలించగలిగెను.

మొదటి విరూపాక్ష రాయలు, పాలనకు వచ్చి ఒక సంవత్సరము తరువాత, తన అన్నగారైన రెండవ బుక్క రాయలు సామంతులు మరియు విధేయుల సహాయమును పొంది, ఇతనిని తొలగించి, విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును స్వాధీనపరుచుకొనెను.

ఇతని సాధనలను గురించి చెప్పవలెనంటే, తన తండ్రి గారైన రెండవ హరిహర రాయల హయాములో, ఓ గొప్ప నావికా సైన్యమును ఏర్పరుచుకొని, సముద్రమును దాటి, సింహళ రాజ్యమును సాధించెను.

మొదటి విరూపాక్ష రాయల పరిపాలన కాలమునందు, అతను గోవా, చావుల్, ధాబోలు వంటి ప్రదేశాలను విరోదుల వద్ద కోల్పోయెనని, పయనికుడు పెర్నోవో నూనీజ్, విజయనగర సామ్రాజ్యమును గురించి వ్రాసిన పుస్తకములో చెప్పియున్నాడు.