1336 వ సంవత్సరమునందు ఇరువురు గొల్ల సోదరులగు మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయల చేత ఈ సామ్రాజ్యము స్థాపింపబడినది.
ముస్లీం సుల్తానులవలన భారత దేశమునందు హిందూ మతము మరియు సంస్కృతి పూర్తిగా అదృశ్యమయ్యేలోగా వాటిని రక్షించాలని వారిరువురు విద్యారణ్యస్వాముల సహకారముతో ఈ సామ్రాజ్యాన్ని స్ధాపించారు.
(మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు)
1309 వ సంవత్సరమునందు మాలిక్ కాఫూర్ అను సుల్తాను, తన రాజ్యమును విస్తరించుటకై దక్షిణ భారత దేశపు దిగ్విజయ దండయాత్రకు బయలుదేరాడు. అతను మొదట వరంగల్ (ఆనాడు ఓరగల్లు) ప్రాంతంపై దండెత్తి, ఆ ప్రంతాన్ని ఏలుచున్న రాజును ఓడించి, విజయము సాధించాడు.
ఆ ప్రాంతమును పరిపాలించిన, ప్రతాపరుద్రుడను అధిపతి యొక్కఆస్థానమునందే కోశాధికారులుగా మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలను ఇరువురు గొల్ల సోదరులు ఉండిరి.
1323వ సంవత్సరములో ఓరుగల్లు పతనము తరువాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలికి పోయి ఆనెగొంది సంస్థానములో చేరారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326 వ సంవత్సరములో కంపిలిని జయించినప్పుడు వీరిద్దరూ బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు. దారిలో భయంకరమగు గాలి దుమారము వచ్చి సైనికులు, బందీలు చెల్లాచెదరయ్యారు. సోదరులిద్దరు మాత్రము పారిపోక ఒక చెట్టు క్రింద కూర్చొనివుండగా సుల్తాను గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతసించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు. సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మార్చబడ్డారు.
కంపిలిలో మాలిక్ నయీబు పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యము చేజారిపోగా విప్లవాన్ని అణచివేయుటకు తుగ్లక్ మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలను పంపాడు. అన్నదమ్ములు కంపిలి స్వాధీనము చేసుకొన్నారు. శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి సుల్తాను నెదిరించి విజయనగర సామ్రాజ్యము స్థాపించారు.
(ఇస్లాము మతమునకు మార్చబడిన, మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలను తమ ప్రభావముతో మళ్ళీ హిందూ మతమును స్వీకరింపజేసిన "విద్యారణ్య స్వాములవారు".)
దక్షిణ భారత దేశమునందు, హిందూ సంస్కృతిని రక్షించడానికి, మొదటి హరిహర రాయలు, విద్యారణ్య స్వాముల సహకారముతో, విజయనగర సామ్రాజ్యమును స్థాపించి, తొలి చక్రవర్తి గా ఇతనే సింహాసనమును అధిష్టించెను.
దక్షిణ భారతపు ముస్లీం సామంతుల తిరుగుబాట్ల వలన, ఢిల్లి సుల్తాను యొక్క పరిపాలన కాలము అంతము చెందినది. దక్షిణ దేశమునందు తిరుగుబడి, స్వతంత్రించిన సామంతులపై దాడి చేసి, మొదటి హరిహర రాయలు తమ ఏలుబడిలో వున్న ప్రాంతాన్ని విస్తరించుకొనసాగెను. ప్రక్క ప్రక్కనున్న, చిన్న-చిన్న రాజ్యములపై దండెత్తి, ఆ ప్రాంతాలను ఏలుచున్న రాజులను ఓడించి, ఆ ప్రదేశాలను తమ రాజ్యముతో కలుపుకున్నాడు. ఈ దండయాత్ర తరువాత, సామ్రాజ్యమునకు, ఆనెగొంది అను పేరుగల ఊరును రాజధానిగా చేసి, అచ్చట నుంచే రాజ్య పరిపాలన మొదలు పెట్టాడు. సమస్యకు పరిష్కారంగా, ప్రవహించుచున్న నదుల నుంచి కాలువలు త్రవ్వించాడు.
(ప్రాచీన కాలపు ఆనెగుంది కోట)
